ప్రధాని నరేంద్రమోదీ మారిషస్ రాష్ట్రపతి ధరమ్ గోకుల్ తో భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన కోసం తూర్పు ఆఫ్రికా దేశమైన మారిషస్ కి వెళ్లిన ప్రధాని మోదీ తన వెంట తీసుకువచ్చిన విలువైన బహుమతులను ధరమ్ గోకుల్ కు అందించారు. మారిషస్ లో జనాభా 14లక్షలు కాగా అందులో 48శాతం హిందువులు పైగా భారతీయ మూలాలు ఉన్నవారే నివసిస్తున్నారు. బ్రిటీష్ కాలంలో కూలీ పనుల కోసం మారిషస్ కు వెళ్లిన భారతీయ కుటుంబాలు ఇప్పుడు అక్కడ రాజ్యాధికారంలో ఉన్నాయి. అందుకే మోదీ తనతో పాటు పవిత్రమైన గంగా జలాన్ని మరచెంబులో తీసుకువెళ్లి ధరమ్ గోకుల్ కు అందించారు. మహా కుంభమేళా సందర్భంగా ఆ గంగాజలాన్ని సేకరించినట్లు మోదీ మారిషస్ రాష్ట్రపతితో తెలిపారు. గంగాజలంతో పాటు బీహార్ సూపర్ ఫుడ్ గా పేరు తెచ్చుకున్న ఫూల్ మఖానాను రెండు సీసాల్లో తీసుకువెళ్లి మోదీ మారిషస్ రాష్ట్రపతికి ఇచ్చారు. వీటితో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా పేరుతో భారత పౌరసత్వాన్ని కూడా మోదీ మారిషస్ రాష్ట్రపతి ధరమ్ గోకుల్ కు మోదీ బహుకరించారు. మోదీ బహుమతులకు కృతజ్ఞతలు తెలిపిన మారిషస్ ప్రెసిడెంట్ ఆయన్ను అధ్యక్ష భవనంలో ఉన్న ఆయుర్వేద వనానికి తీసుకువెళ్లి ఔషధ మొక్కలను చూపించారు. మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్, భారత ప్రధాని మోదీ ఇద్దరూ కలిసి వెలగమొక్క ను నాటారు.